మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు

మన శరీరంలో కళ్లు, ముక్కు, నోరు, గుండె, కాలేయం, కిడ్నీలు.ఇలా ఎన్నో అవయవాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఇప్పటివరకు మనం గుర్తించని, గమనించినా అవయవంగా పరిగణించని కొత్త అవయవాలూ ఉన్నాయని మీకు తెలుసా ఇటీవల శాస్త్రవేత్తలు అలాంటి రెండు అవయవాలను గుర్తించారు. జీర్ణవ్యవస్థలో భాగంగా ఉండే మిసెంటరీ ఒక స్వతంత్ర అవయవమని ఐర్లాండ్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లిమరిక్ శాస్త్రవేత్త కెల్విన్ కొఫె జనవరి నెలలో ప్రకటించగా.. తాజాగా ఇంటర్ స్టిటియంగా పిలుస్తున్న ఓ అవయవ వ్యవస్థను అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ లాంగాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్తగా గుర్తించిన ఈ అవయవం ఎక్కడో ఓ మూలన ఉండేదికాదు.. శరీరమంతటా విస్తరించి ఉండేది కావడం గమనార్హం. మరి వైద్యారోగ్య సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన దశలోనూ మనలో మనకు తెలియని అవయవాలు వుండడం చిత్రం కదా.


సాధారణంగా మనం ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే.సంబంధిత అవయవం పనితీరు దెబ్బతినడంగానీ, ఏదైనా వ్యాధికి లోనవడం గానీ జరుగుతుంది. జీర్ణ వ్యవస్థలో మిసెంటరీని కొత్త అవయవంగా గుర్తించడం, దాని పనితీరు కొంత విభిన్నంగా ఉన్నట్టు తెలుస్తుండటం నేపథ్యంలో.. జీర్ణ వ్యవస్థ పనితీరు, పొట్టకు సంబంధించిన వ్యాధులపై ప్రస్తుతం ఉన్న అవగాహన మారిపోయే అవకాశముందని కెల్విన్ కొఫె చెబుతున్నారు. మిసెంటరీ చేసే పనిమీద ఇంకా పూర్తి స్పష్టత రాలేదని.. మరికొంత పరిశోధన చేయాల్సి ఉందని అంటున్నారు. మిసెంటరీ అంతర్గత నిర్మాణాన్ని పూర్తిగా పరిశీలించామని తెలిపారు.
మిసెంటరీని విడిగా కొత్త అవయవంగా గుర్తించడం వల్ల పొట్ట, జీర్ణ వ్యవస్థల పనితీరు, సమస్యలు మారుతాయి. వాటికి వచ్చే వ్యాధులకు వినియోగించే ఔషధాలలో మార్పులు చేయాల్సి ఉంటుంది.

మిసెంటరీని ప్రత్యేక అవయవంగా గుర్తించిన నేపథ్యంలో.. ఇప్పటికే దీనిపై వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించడం మొదలైందని, వైద్య పాఠ్య పుస్తకం గ్రేస్ అనాటమీలోకి కూడా మిసెంటరీ ఎక్కిందని శాస్త్రవేత్త కెల్విన్ కొఫె వెల్లడించారు. ఇక ఇంటర్ స్టిటియం అనేది పూర్తి కొత్తగా గుర్తించిన అవయవం. శరీరంలో కణజాలాలు, అవయవాల మధ్య ద్రవ రూప రవాణా మార్గాలతో కూడిన ఈ వ్యవస్థ.. మన శరీరశాస్త్రం, వైద్య శాస్త్రాల్లో పెను మార్పులకు కారణమయ్యే అవకాశముంది. ఎందుకంటే మన శరీరంలో రక్తం, లింఫ్, ఇతర ప్రొటీన్లు, హార్మోన్ల రవాణా వంటి ఎన్నో కీలకమైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ కొత్త పరిశోధన వాటికి సంబంధించి మార్పులకు కారణమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *