వన్డే క్రికెట్ లో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ మహిళా జట్టు

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. నిన్న డబ్లిన్ లో ఐర్లండ్ తో జరిగిన వన్డేలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 490 పరుగులు సాధించి… 21 ఏళ్ల క్రితం తాను సాధించిన రికార్డును తానే బద్దలు కొట్టింది. 1997లో క్రైస్ట్ చర్చ్ లో పాకిస్థాన్ తో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టు 5 వికెట్లు కోల్పోయి 455 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

ఐర్లండో తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్ చెలరేగి ఆడింది. 94 బంతుల్లో 151 పరుగులు సాధించింది. మ్యాడీ గ్రీన్ 77 బంతుల్లో 121 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో బౌండరీల వర్షం కురిసింది. 64 బౌండరీలు, ఏడు సిక్సర్లు నమోదయ్యాయి. న్యూజిలాండ్ జట్టు సాధించిన ఈ రికార్డు అంతర్జాతీయ పురుష, మహిళల వన్డే క్రికెట్ లోనే హైయెస్ట్ స్కోర్. పురుషుల వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోరు రికార్డు ఇంగ్లండ్ పేరు మీద ఉంది. 2016లో ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన వన్డేలో పాకిస్థాన్ పై ఇంగ్లండ్ 444 పరుగులు చేసింది.

నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకూలంగా ఉన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ ఓపెనర్లు సుజీ, జెస్ వాట్కిన్ (62 పరుగులు) ఏకంగా 172 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 491 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లండ్ జట్టు 35.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌట్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *