ఎండలోకి మనం వెళ్లకపోవడం వల్ల ఇలాంటి వ్యాధులు కలుగుతాయి

మన జీవన శైలిలో ప్రాణి మనుగడకు సూర్యరశ్మి ఎంతో అవసరం. మూడు నెలల పాటు సూర్యుడు సెలవు పెడితే భూమిపై ఒక్క ప్రాణీ కూడా బతికి ఉండదు. సూర్యుడు అవసరం అంతగా ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరంలో కొన్ని రకాల జీవ క్రియలు చక్కగా జరగాలంటే సూర్యుడి కిరణాలు మన శరీరాన్ని తాకాలి. సూర్యుడి కిరణ శక్తి మన శరీరంలో ప్రతీ కణానికి అందాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్ D సరిపడా ఉత్పత్తి అప్పుడే అవుతుంది. దాంతో ఎన్నో వ్యాధులు దూరంగా ఉంటాయి. తరచూ అనారోగ్యానికి పాల్పడుకూండా ఉంటాం.

ఎండంటే చాలామందికి చిరాకు ఓక రోజు ఎండ ఎక్కువైందంటే నోటి వెంట నిట్టూర్పులు వచ్చేస్తాయ్. ఎండలో బయటకు వెళ్లాలంటే గ్లామర్ దెబ్బతింటుందంటారు కొందరు. ఆధునిక సుఖమయ జీవన విధానం కారణంగా ఏర్పడిన విడ్డూరాలే. ఒకప్పుడు ఎండలోకి వెళ్లకుండా ఏ పనీ అయ్యేది కాదు. కానీ నేడు కాలు తీసి బయట పెట్టిన దగ్గర్నుంచి, తిరిగి ఇంటికి చేరుకునే వరకూ గట్టిగా ఐదు నిమిషాలు కూడా శరీరాన్ని ఎండ తగలకుండా ఎన్నో ఏర్పాట్లున్నాయి. ఆ సూర్యుడి కిరణ శక్తిని గ్రహించకపోవడం సర్వ సాధారణమైపోయిందికానీ, ఒక్కసారి ఆలోచించండి. 20, 30 ఏళ్ల క్రితం ఇన్నేసి వ్యాధులు, అనారోగ్య సమస్యలున్నాయా.కానీ నేడు ఈ పరిస్థితులకు కారణం సూర్యకిరణాలను నేరుగా శరీరానికి సోకే అవకాశం ఇవ్వకపోవడమేనంటున్నారు వైద్యనిపుణులు.

సూర్యుడి కిరణాల కారణంగా శరీరంలో హార్మోన్ల పరంగా కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. సూర్యుని కిరణాల వల్ల సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనం సంతోషముగా ఉండేందుకు ఎంతో కీలకమైనది. మనసును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అదే చీకటి పడితే ఆ చీకటి మన మెదడుకు సంకేతాలు పంపుతుంది. దాంతో మెదడు మెలటోనిన్ అనే హర్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ నిద్ర సంకేతాలను కూడా ఇస్తుంది. అప్పుడు ప్రశాంతంగా నిద్ర పోతారు. తగినంత సూర్యరశ్మి పొందకుంటే శరీరంలో సెరటోనిన్ స్థాయులు పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో ప్రవర్తనపరమైన మార్పులు, డిప్రెషన్, ఒత్తిడికి లోను కావడం, త్వరగా అలసిపోవడం జరుగుతాయి,మంచి మూడ్ లో ఉండకపోవడం ఇలా ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. వీటికి కారణం విటమిన్D లోపించడమే. రోజులో తగినంత సూర్యరశ్మిని పొందడం వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.

సూర్యరశ్మి మన కంటిలో రెటీనాలోని ప్రత్యేక ప్రదేశాలను ప్రేరేపిస్తుంది. దాంతో సెరటోనిన్ విడుదల అధికమవుతుంది. మాయో క్లినిక్ అధ్యయనం ప్రకారం.సెరటోనిన్ తగ్గడం వల్ల SAD (శాడ్) సమస్యల బారిన పడతారని, మరీ ముఖ్యంగా పగటి సమయం తక్కువగా, రాత్రి వేళలు ఎక్కువగా ఉండే శీతాకాలంలో ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని తెలిసింది. దీనికి చికిత్స లైట్ థెరపీ. దీన్నే ఫొటోథెరపీ అని కూడా అంటారు. రోజుల వయసున్న శిశువుల్లో కామెర్లు తగ్గక పోతే ఈ చికిత్సనే ఉపయోగిస్తారు.

ఈ కాంతి మన మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గించి సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సూర్యరశ్మి లోపించడం వల్ల మహిళల్లో రుతుస్రావానికి ముందు మానసికంగా ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఒత్తిడిలో ఉన్న గర్భిణిలకు కూడా మేలు చేస్తుంది. అంటే ఒత్తిళ్లు, మానసిక పరమైన చిరాకుని పోగొట్టాలంటే రోజూ ఎండలో నిర్ణీత సమయం పాటు ఉండడం చాలాఅవసరం అని తెలుస్తుంది.

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ సమయంలో ఎండలో ఉన్నా సూర్యరశ్మిని పొందవచ్చు. కాకపోతే నేరుగా శరీరానికి తాకేలా మనం చూసుకోవాలి. అంటే వంటి నిండా వస్త్రాలు కప్పుకుని ఎండలో ఉంటే ప్రయోజనం ఉండదని దీని అర్ధం . అలాగే సన్ స్క్రీన్ లోషన్లు రాసుకున్నా, సూర్యుని కిరణాలను చర్మం గ్రహించలేదు. సూర్యుని కిరణాలు చర్మాన్ని నేరుగా తాకినప్పుడు మాత్రమే విటమిన్ D ఉత్పత్తి అవుతుంది. కనీసం 40 నిమిషాలు ఉండాలని, కొందరు గంట నుంచి రెండు గంటల పాటు అయినా సూర్యుని వెలుగు తాకేలా చూసుకోవాలని చెబుతారు. కాకపోతే వేసవిలో మాత్రం వైద్యుల సూచనలు తీసుకోవడం తప్పనిసరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *