పచ్చి దుర్మార్గం ఇంజెక్షన్‌ ఖరీదు రూ.14.. పేషెంట్‌ నుంచి తీసుకునేది రూ.5,318

వైద్య చికిత్సకు అవుతున్న ఖర్చు నానాటికీ పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు గురువారం (మార్చి 8)న ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ప్రజలు భరించలేని స్థితిలో ఉన్నారు. మందుల తయారీకెంత అవుతోంది… చికిత్సకు ఎంత అవుతుంది. ఆస్పత్రులు ఎంత వరకూ వసూలు చేయవచ్చు? అసలు ఎంత వసూలు చేస్తున్నాయి.. ఈ అంశంపై దృష్టిపెట్టి, సర్వే చేయించండి’’ అని జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం సూచనలు చేసింది.


ఢిల్లీలోనూ, శివార్లలోనూ, దేశంలోని ఇతర నగరాల్లోనూ వాయుకాలుష్యం వల్ల ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలపై ప్రజలు చేస్తున్న ఖర్చులమీద విచారణ చేపడుతూ బెంచ్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం ప్రదర్శించింది. కేంద్ర ఔషధ ధరల అథారిటీ (ఎన్‌పీపీఏ) ఈ మధ్య చేసిన ప్రకటనను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఢిల్లీలోని నాలుగు ప్రైవేటు ఆస్పత్రులు మందుల అసలు ధరకన్నా 1,192 శాతంఎక్కువ వసూలు చేస్తున్నారని పేర్కొంది.

ముఖ్యంగా ప్రాణం మీదకొచ్చిన కేసుల్లో ఉపయోగించే మందుల విషయంలో ఇలా జరుగుతోందని వివరించింది. ‘‘అడ్రెనర్‌ 2ఎంఎల్‌ ఇంజెక్షన్‌ ఎంఆర్పీ రూ.189.95 ఉండగా, అది ఆస్పత్రులకు రూ.14.70 కే వస్తోంది. రోగుల నుంచి మాత్రం ఒక్కో ఇంజెక్షన్‌పై పన్నులతో కలిసి రూ.5,318.60 వసూలు చేస్తున్నట్లు ఎన్‌పీపీఏ తెలిపింది. 14 రూపాయలు ఖరీదు చేసే మందుకు 5 వేలు పిండుతారా..? ఇది చాలా తీవ్రమైన అంశం’’ అని బెంచ్‌ మండిపడింది.


గుర్గావ్‌ లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రులలో కొన్ని నెలల కిందట ఓ ఏడేళ్ళ బాలుడు డెంగ్యూ జ్వరంతో చేరాడు. చికిత్స సమయంలోనే అతని ప్రాణం పోయింది. ఆ పిల్లాడి వైద్యానికి రూ 18 లక్షల బిల్లు వేసిందా ఆస్పత్రి. ఇది తీవ్ర సంచలనం రేపింది. తగిన చర్యలు తీసుకుంటామని ఆరోజున చెప్పిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇప్పటి దాకా కనీసం ఒక్క నోటీసు కూడా జారీ చేయలేదు. ఇది సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ఆస్పత్రులకెళ్లేందుకే భయపడిపోతున్నారని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. వందలు దాటి ఇపుడు చికిత్సలకు వేలూ, లక్షలూ పోయాల్సి వస్తోందని ఆవేదన చెందింది. ఈ పరిస్థితిని మార్చండని ప్రభుత్వాలను ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *