కళ్ల ముందే నిండు ప్రాణం ముక్కలవుతోంటే ఏమీ చేయలేక..సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇంటర్వ్యూ చదవాల్సిందే..!

సరిహద్దుల్లో యుద్ధం వచ్చినప్పుడు సైనికులు తప్పు చేస్తే ఒక్కోసారి చిన్నస్థాయి ప్రాణ నష్టం ఉంటుంది. కానీ ఒక లోకో పైలెట్‌ రైలు నడిపే డ్రైవర్‌ తప్పిదం చేస్తే ప్రాణ నష్టం ఊహించని విధంగా ఉంటుంది. కనురెప్ప పాటు నిర్లక్ష్యం కూడా విధుల్లో కనిపించకూడదు. కళ్లెదుట బలవన్మరణాలు జరుగుతుంటే గుండెలు అవిసిపోతాయి. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. వారి ప్రాణాల గురించి రైలులో ఉన్న వేలాది మంది ప్రాణాలు పోగొట్టలేము కదా. రైలు నడిపేటప్పుడే భోజనం.. కాలకృత్యాలకూ ఇబ్బంది పడిన సందర్భాలూ విధి నిర్వహణలో సహజం’’ అని అంటున్నాడు

మాది విజయవాడ. అమ్మ వెంకాయమ్మ, నాన్న రామారావు. ముగ్గురు అన్నదమ్ములం. నాభార్య సరళ, ఇద్దరు కూతుళ్లు. హారిక బీటెక్‌, తేజస్వీ ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాను. కొంతకాలం లోకోషెడ్‌లో పనిచేశాను. ఆ తర్వా త ఆర్‌ఆర్‌బీ ద్వారా 1994లో లోకో పైలట్‌గా ఎంపికయ్యాను. శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ప్రతికూలతలను ఏ విధంగా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలోనే కృత్రిమ రైల్వేట్రాక్‌, రైల్వేస్టేషన్‌లు, ఎదురుగా వచ్చే రైళ్ళు అన్ని సృష్టిస్తారు. దీన్ని మోషన్‌ సిమ్యులేటర్‌ అంటారు. అన్నిరకాల పరీక్షల్లో విజయం సాధిస్తేనే ముందు గూడ్స్‌ డ్రైవర్‌గా అవకాశం ఇస్తారు. నేరుగా ప్రయాణికులను తీసుకెళ్ళే లోకో పైలట్‌ డ్రైవర్‌ నియామకం ఉండదు. ఎవరైనా ముందు గూడ్స్‌ రైలు నడపాల్సిందే.. ట్రాక్‌ రికార్డ్‌ ఆధారంగా పాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను నడపడానికి అవకాశం ఉంటుంది.


విధినిర్వహణలో ఉన్నప్పుడు యుద్ధరంగం లో ఉన్నట్టే భావిస్తాం. సరిహద్దు వద్ద సైనికు లు అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఉన్న సైనిక దళా లు ముప్పును అరికట్టగలుగుతాయి. ఇక్కడ అలా కాదు. కనురెప్పపాటు లోకో పైలట్‌ అప్రమత్తంగా లేకపోతే అపారమై న ప్రాణనష్టం, ఆస్థి నష్టం సంభవిస్తుంది. అందుకే నిరంతరం యుద్ధరంగంలో ఉన్నట్టే భావిస్తాం.

సాధారణంగా విమానాలకు పక్షుల వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయని చాలా మంది కి తెలుసు. రైలుకుకూడా అలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అటవీప్రాంతాల గుండా వెళుతున్నప్పుడు పక్షులు దూసుకువస్తాయి. ఒక్కసారిగా ముందు అద్దానికి తాకి చనిపోతాయి. వాటినుంచి రక్షణకు ముందు ఇనుప జాలి ఉంటుంది. అయినప్పటికీ ఇబ్బందిగా మారుతుంది. పక్షులతోనే కాదు, పశువులతో కూడా చాలా పెనుప్రమాదం పొంచి ఉంటుంది. ముఖ్యంగా గేదెలు, దున్నపోతులు అయితే ఎంత పెద్దఎత్తున హారన్‌ మోగించినా పట్టించుకోవు.

ట్రాక్‌మధ్యలోనే నిలబడుతాయి. వేగంగా వెళ్లి ఒక్కసారిగా ఢీకొనగానే మాంసం ముద్దలుగా ఎగిరిపడతాయి. కొమ్ములు, పెద్ద మాంసపు ముద్ద జాలిలాగా ఉండే కాటిల్‌ గార్డ్‌ మధ్యలో ఇరుక్కుపోతాయి. తప్పనిసరిగా రైలును ఆపి దాన్ని తొలగించిన తర్వాతే రైలు కదులుతుంది. అప్పుడు ఉంటుంది మాకు కష్టం. పగలు అయి తే అందుబాటులో గ్యాంగ్‌మెన్‌లు దాన్ని లాగడానికి సహాయపడతారు. గూడ్స్‌ రైలు డ్రైవర్‌ అయితే కష్టాలు చెప్పనలవి కావు. పాసింజర్‌ రైలు అయితే ప్రయాణికుల సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది.

రైలు కూత ప్రజలకే కాదు. డ్రైవర్‌లకూ ఇబ్బందికరమే.. చాలామంది డ్రైవర్‌లకు వినికిడి సమస్య తలెత్తుతుంది. కొంతమందికి కర్ణభేరి పగిలి శాశ్వతంగా చెవుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైలుకూతలో కూడా రెండు రకాలు ఉంటాయి. లోటోన్‌, హైటోన్‌ ఉంటా యి. హైటోన్‌ చివరలో ఉన్న గార్డుకు సైతం వినిపించేలా ఉంటుంది. లో టోన్‌ ఎదురుగా వచ్చే వారికి వినిపించే విధంగా ఉంటుంది.

రైలు నడిపే సమయంలో ఇద్దరు పైలట్లు, ఒక అసిస్టెంట్‌ పైలట్‌ ఉంటారు. డ్రైవర్‌ అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాడా లేడా అని నిరంతరం మానిటరింగ్‌ జరుగుతుంది. కమ్యూనికేషన్‌ విభాగం అధ్వర్యంలో వివిధ రకాల బల్బు ల రూపంలో వెలుగుతున్న సంకేతాలకు అనుక్షణం రెస్పాండ్‌ అవుతుండాలి. లేదంటే కొద్ది సేపటికి ఆటోమెటిక్‌గా రైలు ఆగిపోతుంది. డ్రైవర్‌ ఒక్కోసారి అనారోగ్యం పాలైనప్పుడు.. ఇంకా ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు రెస్పాం డ్‌ అవడం లేదన్న భావనతో రైలు ఆగిపోయే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. ప్రతి మూడేళ్లకో సారి లోకోపైలట్‌లకు ఆధునిక పోకడలకు అనుగుణంగా మరోసారి శిక్షణ అందిస్తారు.

లోకోపైలట్‌గా యూనిఫారమ్‌, టార్చిలైట్‌, 5లీటర్ల వాటర్‌ బాటిల్‌, వేసవి కా లం అయితే ఓఆర్‌ఎస్‌ పాకెట్లను రైల్వే శాఖ సమకూరుస్తుంది. ఇంజిన్‌ బోగిలో ఉంటే కొలిమిలో ఉన్నట్టే.. సాధారణ ఉష్ణోగ్రత కంటే కనీసం పది డిగ్రీలు బోగీలో ఎక్కువ ఉంటుంది. ఎండా కాలం ఇక చెప్పనలవి కాదు. ఎయిర్‌ కండీషన్డ్‌ సౌకర్యం ఇపుడు కొత్తగా వచ్చే రైళ్ళల్లో వస్తున్నాయి. పాత వాటిల్లో మాత్రం ఎక్కడా లేవు. రైలు నడుపుతూ నే భోజనం చేయాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి 5 లీటర్ల వాటర్‌ బాటిల్‌, రైల్వేశాఖలో ఇపుడు లభ్యం అవుతున్న భోజనం పాకెట్లు తీసుకుంటాము. నెమ్మదిగా వెళ్ళే సమయంలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉన్నప్పటికీ.. పైలట్‌ పూర్తి అప్రమత్తంగా ఉంటూనే భోజనం చేయాల్సి ఉంటుంది. ఇక కాలకృత్యాల గురించి చెప్పలేము. రైల్వేశాఖ నేచురల్‌ కాల్స్‌ కోసమని నిర్ణీత సమయం ఇస్తుంది.

అయితే ప్రయాణికులను సకాలంలో గమ్య స్థానానికి చేర్చాలన్న బాధ్యతతో ఆ సమయాన్ని వినియోగించుకోలేము. రైలు ఆగే స్టేషన్‌లలో మాత్రమే దిగి పక్క బోగీలోకి వెళ్ళి కాలకృత్యాలను తీర్చుకుంటాము.జీవన పోరాటంలో సమస్యలను అధిగమించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. మహిళలు, పిల్లలతో పాటు రైలుకెదురుగా వస్తుంటారు. కొంతమంది వృద్ధులు ఏమరపాటుతో గేట్‌ల వద్ద పట్టాలు దాటుతుంటారు. కొందరు ఏకంగా ట్రాక్‌మీద తలలు పెట్టి పడుకుంటారు. చాలా దూరం నుంచే మాకు కనిపిస్తారు. అయ్యో.. పాపం.. ఏం చేయాలి.. ఏదో ఒకటి చేయాలి అని తాపత్రయపడుతుంటాం.

బ్రేక్‌వేసి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాము. ఆ ఒక్క క్షణం నిండు ప్రాణాన్ని కాపాడితే బాగుండు అనుకుంటాము. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి మాది. ఒక్కరి ప్రాణం కోసం ప్రయత్నిస్తే వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే కళ్ళముందు నిండు ప్రాణం రెండు ముక్కలవుతున్నా ఏమీ చేయలేకపోతాం. చాలాసేపు మనసంత భారంగా ఉంటుంది. విధినిర్వహణలో ఇలాంటి సందర్భాలు ఉండకూడదనే కోరుకుంటాం. అయితే చాలామంది అనుకుంటున్నట్టు రైలు చక్రం మనిషి మీదుగా వెళ్ళే అవకాశం ఉండదు. అంతకంటే ముందే ఉండే రేల్‌గార్డ్‌ బలమైన పదునైన ఆయుధం లాగా పనిచేస్తుంది. పెద్ద బండరాళ్ళను పిండి చేస్తుంది. ఆ రేల్‌ గార్డ్‌ వల్లనే మనిషి రెండుగా వేరవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *