విమానంలో వచ్చాడు.. పని కానిచ్చేసి వెళ్లిపోయాడు.. వ్యవహారం ఎలా బయటపడిందంటే..!

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ భర్తనే హత్య చేయించింది. గురువారం సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీపీ గోవర్ధన్‌, సీఐ వెంకట్‌రెడ్డితో కలిసి డీసీపీ సాయిశేఖర్‌ వివరాలు వెల్లడించారు. ఫతేనగర్‌లోని పైపులైను కాలనీలో నివాసముంటున్న బీహార్‌ రాష్ట్రం, ఛాప్రా జిల్లా, ఇబ్రహీంపూర్‌కు చెందిన జయ్‌మంగళ్‌దాస్‌ (35) ఎనిమిదేళ్ల కిందట జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. వీలు దొరికినప్పుడల్లా స్వగ్రామంలో ఉంటున్న భార్యాపిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు. రానుపోను ప్రయాణ భారం తదితర సమస్యల వల్ల పిల్లలను తీసుకుని నగరానికి వచ్చేయాలని భార్యకు తెలియచేశాడు.

మూడు నెలల క్రితం మాలతీదేవి పిల్లలతో కలిసి నగరానికి వచ్చేసింది. మాలతీదేవి ఇబ్రహీంపూర్‌లో ఉన్నప్పుడు తనకు మరిది వరుసయ్యే నీరజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త దగ్గరికి చేరుకున్నా కూడా ప్రతీ రోజు ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడేది. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న భర్తను కడతేర్చేందుకు ఫోన్‌లోనే ప్రియుడితో కలిసి పథకం రచించింది. భర్తను హతమార్చుదామనుకున్న రోజు అతనితో అధికంగా మద్యం తాగించింది.

అతను నిషాలో నిద్రకు ఉపక్రమించగానే అప్పటికే పాట్నా నుంచి ఫ్లైట్‌లో వచ్చి బాలానగర్‌లో ఉన్న ప్రియుడికి సమాచారం అందించింది. ఆ తర్వాత నీరజ్‌కుమార్‌, మాలతిదేవి కలిసి జయమంగళ్‌దాస్‌ మెడకు ఇనుప వైరు బిగించి చంపేశారు. మరుసటి రోజు నీరజ్‌కుమార్‌ మళ్లీ పాట్నాకు వెళ్లిపోయాడు.

పోలీసుల దృష్టి మళ్లించేందుకు తన చావుకు ఆర్థిక సమస్యలే కారణమని, ఇంకెవరి ప్రమేయం లేదంటూ భోజ్‌ఫురి భాషలో లేఖను రాసి పెద్ద కుమారుడి పుస్తకంలో పెట్టారు. విచారణ ప్రారంభించిన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించి హత్య మిస్టరీని చేధించారు. వారంలో హత్య కేసును చేధించిన పోలీసులను డీసీపీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *