దేవుళ్ల విషయంలో కూడా తేడాలు ఎందుకు..? ప్రతిసారీ దేవుళ్ళను దేవతలను తెల్లగానే చిత్రిస్తారు

దేవుళ్లు తెల్లగానే ఎందుకు ఉండాలి..? ఈ ప్రశ్న కొద్దిరోజులుగా తమిళనాడులోనే గాకుండా నెటిజన్లలోనూ ఓ చర్చకు దారితీస్తున్నది స్థూలంగా చూస్తే, పైపైన పరిశీలిస్తే. ‘‘అవును కదా ఈ వర్ణవివక్ష ఏమిటి అసలు మన చుట్టూ ఇంతమంది నల్లటివాళ్లు ఉన్నప్పుడు దేవుళ్లు మాత్రం తెల్లగానే ఎందుకు ఉండాలి వాళ్లు మనలాగే ఎందుకుండరు. లక్ష్మికళ అంటే తెల్లగా కళకళలాడుతూనే ఉండాలా.

ప్రతి అత్త తన కోడలు లక్ష్మిలాగే ఉండాలనే కోరుకోవాలా..? ఏం..? నల్లదనంలో అందం లేదా..? నల్లగా ఉంటే అందగత్తెలు కారా..? నలుపులో ఆకర్షణే లేదా..? ఇది వర్ణవివక్షను పెంచడం కాదా..? దేవుళ్లను కూడా మనం సామాన్యీకరించలేమా..? ఇక్కడి దాకా పోయింది చర్చ అప్పుడే అయిపోలేదు.ఈ స్థాయికీ వెళ్తున్నది చర్చ ఎలా మొదలైంది..??

చెన్నైకి చెందిన భరద్వాజ్ సుందర్, నరేష్ నిల్… యాడ్ ఫిలిమ్స్ తీస్తుంటారు… పనిలోపనిగా వాళ్ల క్రియేటివిటీకి పదునుపెట్టే పనులూ చేస్తుంటారు… ఆలోచించగా.., చించగా వాళ్లకు ఓ ప్రశ్న తటాలున తట్టింది… అవునూ, దేవుళ్లందరూ తెల్లగానే ఎందుకుంటారు ఎందుకుండాలి..? సో.., ఈ కాన్సెప్టునే కాస్త డెవలప్ చేసుకుని, నల్లగా ఉన్న మోడళ్లను ఎంచుకుని, వాళ్లతోనే పలు దేవతల చిత్రాల్నిఅచ్చం మనం రోజూ కేలండర్లలో చూసే ఫోజుల్లోనే ఫోటో షూట్ చేశారు… వీడియోలూ తీశారు… ఇవన్నీ ప్రదర్శించటానికి సోషల్ మీడియా వేదిక ఉండనే ఉందిగా.

డార్క్ఈజ్‌డివైన్ పేరుతో వాటిని అప్‌లోడ్ చేశారు జనం ఆసక్తిగా గమనించారు లైకులు, షేర్లు సరేసరి… కామెంట్లు, చర్చలు, మెచ్చుకోళ్లు, పెదవివిరుపులు ఎట్సెట్రా పత్రికలు కూడా పలు ప్రత్యేక వ్యాసాలు రాశాయి… శెభాష్ బ్రో అన్నాయి ఇలా బహుళ ప్రశంసలు దక్కాయి వాళ్లకు అఫ్ కోర్స్, ఇందులో వాళ్ల క్రియేటివిటీయే ఉంది తప్ప దేవుళ్లను అగౌరవపరచడం ఏమీ లేదు కాబట్టి ఎవరి మనోభావాలూ దెబ్బతినలేదు ఏ హిందూమున్నాని కూడా కత్తులు పట్టుకుని, కన్నెర్ర చేయలేదు, దాడికి దిగలేదు సంతోషం.

అందరు దేవుళ్లూ నల్లగా ఉంటారని ఎవరన్నారు..? ఎందుకలా సూత్రీకరించాలి..? హిందూ జాతి యావత్తూ పూజించే శ్రీకృష్ణుడు గానీ, శ్రీరాముడు గానీ తెల్లగా ఉండరు… నీలమేఘ వర్ణం… మన పిచ్చి దర్శకులు వాళ్ల దేహాలకు నీలం రంగు దట్టంగా పూసేసి (చివరకు మంచి చిత్రకారుడైన బాపుతో సహా…) తృప్తిపడ్డారు తప్ప నీలమేఘఛాయ అంటే దట్టమైన నీలం రంగా..? కాదు కదా… రామాయణం గానీ, భాగవతం గానీ వాళ్లను శ్యామ వర్ణంలోనే చూపిస్తాయి… శ్యామ అంటే బూడిద రంగు, నలుపు రంగు, నీలం రంగు… నీలమేఘశ్యామ అంటే చామనఛాయ అనుకుందాం.

సింపుల్‌గా చెప్పాలంటే ‘కాస్త కలర్ తక్కువ’… అంతే… కాకపోతే మన కవులు కాస్త ఈ దేవుళ్లకే మరింత పవిత్రతను, మరింత దైవత్వాన్ని ఆపాదించటానికి ఆకాశం, అఖండ విశ్వం రంగు అనుకుని నీలాన్ని పులిమారు… నిజానికి విశ్వం నీలంగా ఉండదు… అదీ నలుపే… ఆకాశం కూడా రకరకాల కాంతి పరావర్తనాల కారణంగా నీలంగా కనిపిస్తుందే తప్ప దాని ఒరిజినల్ కలరూ నీలమేమీ కాదు… వెరసి రాముడు గానీ, కృష్ణుడు గానీ మనలాంటోళ్లే అని అంతిమంగా తేల్చేసుకోవాలి, తెలుసుకోవాలి…. ఇదుగో ఈ వాదనలు కూడా బోలెడు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *