మరో ప్రేమోన్మాది ఘాతుకం మరదల్ని గొంతుకోసి, తానూ…!!

ప్రేమ కోసం ప్రాణం ఇచ్చేవారు ఒకప్పుడు… కాని ఇప్పుడు ప్రేమ కోసం ప్రాణం తీస్తున్నారు… కాదు కాదు… తమకు దక్కలేదన్న బాధతో ప్రేమనే చిదిమేస్తున్నారు. కర్కశంగా ప్రాణాలను బలిగొంటున్నారు. హైదరాబాద్ లో కార్తీక్ అనే ప్రేమోన్మాది ఘటనను మరవకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది యువతి గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు కూడా పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.


దమ్మపేట మండలం నెమలిపేటలో శనివారం (డిసెంబర్-30) ఈ దారుణం జరిగింది. వివరాల్లోకెళితే.. స్థానిక పాఠశాలలో విద్యావాలంటీర్‌గా పని చేస్తున్న ప్రవళిక అనే యువతిని.. ఆమె మేనబావ శ్రీనివాస్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే అతనికి ఉద్యోగం లేని కారణంగా తనతో పెళ్లికి ప్రవళిక నిరాకరించింది. కొద్దిరోజుల క్రితం ప్రవళ్లికకి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది.


దీన్ని తట్టుకోలేకపోయిన శ్రీనివాస్ శనివారం ప్రవళిక పని చేస్తున్న పాఠశాల వద్ద ఆమెపై దాడికి దిగాడు. కత్తితో ఆమెను దారుణంగా గొంతుకోసి చంపేశాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తాను కూడా పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ టీచర్ హత్యకు గురవడాన్ని చూసి విద్యార్థులు షాక్ అయ్యారు. ప్రవళిక రక్తపు మడుగులో పడిపోయింది. ప్రవళిక తల్లిదండ్రుల రోదన ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *